యాదన్నా!!! ఇది ముమ్మాటికి తప్పురా...


By kompally - Posted on 20 February 2010

ఎవరు కన్న బిడ్డడో ఈడు
ఎంతున్నదో ఈడికి ఈడు
అంతకంతకు ముసుకులేసుకుంటున్న
మన ప్రజా నాయకులు కన్న బిడ్డల కన్న చిన్నోడు

ఎవరు జెప్పిరిరా నీకు తెలంగాణ యిస్తానని...
ఎవడు అన్నాడు రా తెలంగాణ నీదని...
ఆడెవడో అన్నాడని ఆడెవడో ఇనలేదని
ఇంత పని జేసుకొని ఏమి సాధించినావు రా...

నిన్ను జూసిన కండ్లన్నిటికి
కంటి నిండ నీళ్ళు నింపినా
నిన్ను విన్న చెవుల్లన్నిటికి
నీ మాట తూట్లు బొడిచినా
కనికరం లేని మన పాలకుల కోసమా
ఇంత పని జేసుకుంటివి

అమ్మ అయ్య లేరని
తెలంగాణే నా ద్యేయమని
ఇన్ని మాటలు జెప్పినోడివి
ఇంత త్యాగం ఎందుకు రా...

బతికి ఉంటే, ఈ బద్మాష్ గాండ్లని
జబర్దస్తి జెయ్యొచ్చు
రొమ్ము యిరిచి పోరాడొచ్చు
సెగలు గక్కే తెలంగాణ యువరక్తపు
కనికలతోటి ఈల్ల ఇండ్లల్ల కొరివి రాజేయ్యొచ్చు

తప్పు తమ్మి తప్పురా
యాదన్నా!!!   ఇది ముమ్మాటికి తప్పు రా
నువ్వు సూద్దామనుకున్న తెలంగాణ కోసం
ప్రాణం తీసుకోకు రా...
అమ్మ కడుపు నిండాలంటే
పిడికేడిత్తుల కోసం కష్టపడతం గాని
ప్రాణం తీసుకోని అమ్మ కడుపు మాడ్చం రా...
                                     

                                                     -శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి