ఓ నాగరీకుడా... ఏదీ నీ నాగరికతా... ఏందీ నాగరీకతా...
పల్లె అన్న ఆ పదానికున్న పదును జూసి మాట్లాడు
పల్లెటూళ్ళలో మగ్గుతున్న ఆ జనాన్ని జూసి మాట్లాడు
పల్లె సీమలె ఈ పట్టణాలకు పుట్టగోడుగులని మరిసినావ్
పల్లె ప్రజలను విస్మరించి ఏం పురోగతి సాధించినావ్
నాగరీకుడా... నీ పట్టణానికి పట్టెడన్నంబెట్టె
మన పల్లెటూళ్ళను ఎందుకు తుడిచి పెడ్తున్నావ్
అలమటిస్తున్న కడుపులను
తడారని ఆ గొంతు ఆపేక్షలను
అలుముకున్న చీకట్లను
ఆదరించే చేతులు నీకు లేకపోయినా
అడివితల్లి కన్న బిడ్డలను ఆగం ఆగం జేస్తున్నావ్
నాగరీకుడా... నీ మనిషి రూపానికి పిడికెడు గుండె వెట్టినా...
గుప్పెడు మనసు నీకు రాక పాయే... నీ అనాగారీకతను చాటుకున్నావ్...
బట్టకట్టి నువ్వు బతుకుతుంటే... మాకు కట్టమని వాళ్ళు అడిగిండ్రా
బిర్యాని తిని నువ్వు బలుస్తుంటే... మాకు పెట్టమని వాళ్ళు ఏడిశిండ్రా
అడగకుండానే అన్ని ఇస్తా... అడవిపుత్రులను అందలమేక్కిస్తానని
మూరెడు బారెడు ఆశలు జూపి... మఫ్తి లో వచ్చిన మాయల ఫకీరు లాగ
గోడు జెప్పని ఆ గిరిజనుని బతుకుజింపి బట్టబయలు జేస్తవా...
నాగరీకుడా... నువ్వు ఆరగించిన ఆ కొవ్వు కరగనీకే
ఆపసోపాలు పడ్తూ... ఇంకా నెమరువేస్తూ నీ మదము సాటుకున్నావ్...
ఓ నాగరీకుడా...
ఏదీ నీ నాగరికతా... ఏందీ నాగరీకతా...
ఏడికివోతున్నావ్ ఈ అయోమయ గోళంలో
ఏదీ నీ ఉనికి... ఏందీ ఉన్మాదం
ఎవరికన్నా తప్పేనా నువ్వు పెంచిన ఈ ఉప్పెన.
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి