కేంద్రరాజ్య ప్రభుత్వాలు
కేంద్రరాజ్య ప్రభుత్వాల
నడుపుచున్న కాడెద్దులు
అనుకుంటున్నై పాపము
తెలంగాణ ఉద్యమాన్ని
అణచివేసి, ఉందామని.
నాయకులను పట్టుకుంటే
అలజడాగి పోతుందని
ఎంత అమాయకత వారిది
అయ్యగారు లేకుంటే
అమాసాగి పోతుందా?
ఉద్యమాన్ని నడిపేది
నాయకులా అసలు కాదు
నడుస్తున్న ఉద్యమంలో
దూకిన వారే అందరు.
తెలంగాణ వేర్పాటును
కోరేది పార్టీకాదు
ఏదో ఒక ముఠాకాదు
తెలంగాణ ప్రజలందరు
కోరేది తెలంగాణ
ప్రత్యేక తెలంగాణ.
తొమ్మిది జిల్లాల ప్రజల
తీవ్రమైన కోరిక ఇది
నాయకులను జేల్లెస్తే
అణగే అలజడి కాదిది.
కోటిన్నర ప్రజలల్లో
ఒక్కడు మిగిలిన సరియే
తెలంగాణ వేరనుచు
అలజడి సాగిస్తాడు.
--
అరునెల్ల నుండి సాగు
తొమ్మిది జిల్లాలలోని
ఆందోళన అలజడంత
అణిగే దసలేకాదు.
విద్యార్ధులు, యన్.జి.వోలు
లాయర్లు, డాక్టర్లు
పట్టభద్రులు, వర్తక
వాణిజ్యపరులు, చిల్లర
బేరగాళ్లు, రైతులు
జానపదులు అందరు
అందరికందరు కోరేది
ప్రత్యేక తెలంగాణ.
పోలీసు సిబ్బంది కూడ
రేపో మాపో విసిగి
తెలంగాణ ఉద్యమంలో
చేరినను చేరవచ్చు.
ప్రజలు వేల లక్షలాది
ప్రజలు రోజు జేలుకేగ
మమ్మంటే మమ్మంచు
ముందుకు వస్తున్నప్పుడు
ఏదో ఓ కొందరిని
పట్టి జేలు కంపినంత
ప్రత్యేక తెలంగాణ
కోరిక ఆగేది కాదు.
తెలంగాణ ప్రత్యేక
తెలంగాణ వెలయుదాక
తెలంగాణ ప్రజలు
ఇటులె అలజడి సాగిస్తారు.
భారతమాతాకీ జై
తెలంగాణ జిందాబాద్.