అందరి నోటా..... తెలంగాణ మాట


By deshetti - Posted on 19 April 2010

(మహబూబ్‌నగర్ - ఆన్‌లైన్ ప్రతినిధి) తెలంగాణ ఏర్పాటుతోనే పాలమూరుకు న్యాయం జరుగుతుందని ఉద్యోగాలు, సాగునీళ్లలో వాటాలు దక్కుతాయని అసమానతలు తొలగిపోతాయని ప్రజలు శ్రీ కృష్ణ కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజల నోట తెలంగాణ మాటే వినిపించింది. శ్రీ కృష్ణ కమిటీ సభ్యులుగా ఉన్న అబుల్‌సలే షరీఫ్, రవిందర్‌కౌర్ సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు.

ప్రజలు స్వచ్ఛందంగా తెలంగాణ కోరుకుంటున్నారా లేక వత్తిడుల వల్ల ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా అనే విషయాన్ని కమిటీ సభ్యులు ప్రజల నుంచి నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఒక మహిళ అలాంటి అభిప్రాయంలేదని స్పష్టంగా బదులిచ్చింది. దీంతో ప్రజలు స్వచ్ఛందంగానే తెలంగాణ కోరుకుంటున్నారని ఆ తర్వాత సభ్యుడు షరీఫ్ అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులు గ్రామాలలో పర్యటించి ప్రజలతో అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ప్రజాపథంలో కూడా పాల్గొ న్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ తెలంగాణ ఏర్పాటే అన్నింటికి పరిష్కారం చూపుతుందని స్పష్టంగా వెల్లడించారు. ఉదయం 9.15 గంటలకు కడ్తాలకు చేరుకున్న సభ్యులకు జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. తర్వాత 9.45 గంటలకు ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామానికి చేరుకున్నారు. తెలంగాణ నినాదాలతో ప్రజలు వారికి స్వాగతం పలికారు. గంటకు పైగా ప్రజలతో మాట్లాడారు. గ్రామ పంచాయితీ భవనంలో ఒక్కొక్కరిని పిలిచి అభిప్రాయాలు సేకరించారు.

ముందుగా యాదమ్మ అనే మహిళతో అభిప్రాయాన్ని తీసుకున్నారు. తెలంగాణ ఎందుకు కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు ఆమె ఘాటుగా బదులిచ్చింది. మా జీవితాలు నాశనం అయ్యాయి. ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు. తెలంగాణ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేసింది. తర్వాత రిటైర్డ్ ఉపాధ్యాయుడు శ్రీపతి రాజేశ్వర్‌రెడ్డి (69)తో మాట్లాడారు. 1956 తర్వాత జరిగిన అన్యాయాన్ని ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ ఆవశ్యకతను అతను సభ్యులకు వివరించాడు.

10వ తరగతికి చెందిన విద్యార్థినులు స్వాతి, జ్యోతి సభ్యులతో మాట్లాడి తెలంగాణ వస్తేనే తమకు ఉద్యోగాలు వస్తాయని, వలసలు ఆగుతాయని చెప్పారు. రైతులు కళ్లు సుధాకర్‌రెడ్డి (60), యాదయ్య (50) రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ దుస్థితిని కమిటీకి వెల్లడించారు. సాగునీటిలో పూడ్చలేని అన్యాయం జరిగిందని, ఉచిత విద్యుత్ కూడా సక్రమంగా రావడంలేదని రైతుల కష్టాలు తీరాలంటే తెలంగాణ ఏర్పాటు ఒక్కటే మార్గమని చెప్పారు. గ్రామంలో 20 మందితో సభ్యులు అభిప్రాయాలు సేకరించారు. ఇందులో ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు, రైతులు ఉన్నారు.

అనంతమ్మ, భారతమ్మ, శ్రీనివాస్ గౌడ్, శ్రీపతి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ శిరోలి, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మతో పాటు పద్మమ్మ, యాదయ్య, రాములమ్మ, సుగుణమ్మ, రాంచంద్రయ్య, నరేందర్‌రెడ్డి, కొండయ్య, యాదయ్య, పుల్లారెడ్డి, లక్ష్మి, రక్కి, చావులి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సభ్యుల ముందు అభిప్రాయాలు వెల్లడించారు. తర్వాత అబూసలే షరీఫ్ గ్రామంలో తిరిగి పాఠశాల, రోడ్లు, ఇళ్లు పరిశీలించారు. తర్వాత అక్కడి నుంచి దొడ్లపాడుకు వెళ్లి ప్రజాపథంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

మహిళా సంఘం సభ్యురాలు లక్ష్మమ్మ, యాదమ్మ ప్రజాపథంలోనే బహిరంగ వేదికపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. చదువులు లేక తమ పిల్లలు హోటళ్లలో పని చేస్తున్నారని, ఆంధ్ర వాళ్ల పిల్లలు హాయిగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. తమకెందుకీ శిక్ష అని ప్రశ్నించారు. మా హక్కులు మాకు దక్కాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందేనని కోరారు. జేఏసీ కన్వీనర్ శివలింగం జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా సభ్యులకు వివరించారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అందరి అభిప్రాయం ఒక్కటే అది తెలంగాణ ఏర్పాటు అని స్పష్టం చేశారు.

అక్కడి నుంచి ఆమనగల్లు మీదుగా కల్వకుర్తి ఆర్అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుని అక్కడ అన్ని పార్టీలతో వినతి పత్రాలు స్వీకరించారు. ఆమనగల్లు, కల్వకుర్తిలలో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి కమిషన్ గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నుంచి జడ్చర్లకు చేరుకున్న సభ్యులు అక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలతో అభిప్రాయాలు తీసుకున్నారు. 12 సంఘాలకు చెందిన ప్రతినిధులు తెలంగాణ ఆవశ్యకతను సభ్యులకు వివరించారు. జిల్లాకు సాగునీళ్లు రావాలంటే తెలంగాణ ఏర్పాటు కావాలని కోరారు.

కల్వకుర్తికి చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ మోహన్‌సింగ్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని హిందీ భాషలో పుస్తక రూపంలో తయారు చేసి ఇచ్చారు. జడ్చర్లలో లయన్స్ క్లబ్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు సభ్యుల ముందు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విలీనం తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు జరిగిన అన్యాయానికి కారణాలను విశ్లేషిస్తూ తెలంగాణ ద్వారానే పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

అన్ని పార్టీల సభ్యులు తమ నివేదికలు అందజేశారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్న శ్రీ కృష్ణ కమిటీ సభ్యులు రెవెన్యూ సమావేశ మందిరంలో వివిధ వర్గాల నుంచి వినతులను తీసుకున్నారు. తెలుగుదేశం తరపున ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఎమ్మెల్యేలతో కలిసి నివేదికను అందజేశారు. కాంగ్రెస్ తప్పిదం వల్లే మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్‌లను కూడా కమిటీ సభ్యులు సందర్శించాలని జరిగిన అన్యాయం, అసమానతలు ఒక్క రోజుతో తెలియవని చెప్పారు.

1956 నుంచి రికార్డులు పరిశీలించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపు మున్సిపల్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ప్రజా ప్రతినిధులు ఆమోదించిన తీర్మానాన్ని అందజేశారు. రేవంత్‌రెడ్డి విడిగా నివేదిక ఇచ్చారు. తెలంగాణ జేఏసీ పక్షాన టీఎన్‌జీఓ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి నివేదిక ఇచ్చారు. సీపీఐ తరపున కూడా నివేదిక ఇచ్చారు.

టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ రాష్ట్ర నేత నిరంజన్‌రెడ్డి నివేదిక ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని సమస్యలు పరిష్కారమౌతాయని అన్ని పార్టీలు స్పష్టం చేశాయి. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు రెవెన్యూ భవనం ఎదుట తెలంగాణ పాటలు పాడి తమ మనోగతాన్ని వెల్లడించారు. రాత్రి 7 గంటల వరకు వినతులు స్వీకరించారు.

Read the original article here

Source: 
Andhra Jyothy