తెలంగాణ వాదం బలంగా ఉంది: అబూసలే షరీఫ్
(మహబూబ్‌నగర్ - ఆన్‌లైన్ ప్రతినిధి): ప్రజల్లో తెలంగాణవాదం బలంగా ఉన్నదని శ్రీ కృష్ణ కమిటీ సభ్యుడు అబూసలే షరీఫ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణపై ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం బాగా ఉన్నదని చెప్పారు. సోమవారం ఆమనగల్ మండలం ఆకుతోటపల్లి గ్రామంలో ప్రజలతో మాట్లాడిన అనంతరం గ్రామ పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఇళ్లు, రోడ్లు, పాఠశాల, ప్రాథమిక సౌకర్యాలను పరిశీలించిన తర్వాత ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు.
ప్రజలతో సమావేశం కావడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఇంకా అనేక గ్రామాల్లో పర్యటిస్తామని అన్ని ప్రాంతాల ప్రజల మనోగతాలను తెలుసుకోవడంతో పాటు అక్కడ జరిగిన అభివృద్దిని మొత్తంగా తారతమ్యాన్ని బేరీజు వేసి నిజాయితీతో నివేదిక తయారు చేసి పార్లమెంటుకు సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణ ఎందుకు కోరుతున్నారు. 1956 తర్వాత చేసుకున్న ఒప్పందాలు అమలు చేసి ఉంటే తెలంగాణ కోరేవారా, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారా అనే ప్రశ్నలు అడిగి ప్రజల మనోగతాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు.
ప్రజలు ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ కోరుకుంటున్నారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. చదువు సంధ్యలులేని ఒక ఎస్సీ మహిళను కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించాడు. ఆమె మేము తెలంగాణ కావాలని కోరుతున్నాం తప్ప ముఖ్యమంత్రి ఎవరైనా అభ్యంతరం లేదనే రీతిలో సమాధానం చెప్పింది. రాష్ట్ర విలీనం తర్వాత జరిగిన ఒప్పందాలు అమలు జరిగి ఉంటే ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదనే అభిప్రాయం కూడా వచ్చింది. కమిటీ సభ్యులు అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
జిల్లాలో గిరిజన ప్రాంతాలను తమ పర్యటనకు ఎన్నుకున్నారు. రైతులు, విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, విద్యావంతులు, న్యాయవాదులు ఉద్యమ సంఘాల నేతలతో కూడా అభిప్రాయాలు సేకరించారు. దొడ్లపాడులో ప్రజాపథంలో పాల్గొన్నారు. బహిరంగ సమావేశంలో మహిళలు, ఇతర వర్గాల అభిప్రాయాలను వారి అవగాహనను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
విద్య, వైద్యం, పేదరికం, సాగునీళ్లు, తాగునీళ్లు అభివృద్ధి వెనుకబాటు సమస్యలన్నింటికీ పెత్తందారి పాలనే కారణమని అన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు చదువు రాని వారు, విద్యావంతులు అందరూ తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని స్పష్టంగా వెల్లడించారు. రవిందర్‌కౌర్ మహిళల అభిప్రాయాలను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు.
Read the original article here