Ode to Prof Jayashankar


By kompally - Posted on 02 November 2011

నిశబ్ధం...!
ఆదిగురువు ఇక లేరు అన్న విషయం... ఒక నిశబ్ధం...
ఈ గడ్డ మన్ను తిన్న మానవాళి వెన్ను తట్టి
వేగు చుక్కలా దారి చూప మిన్నుకేగిన
ఆదిగురువు ఇక కనపడరన్న మాట... ఒక నిశబ్ధం...
తెలంగాణ సాధనకు తెరలేపి...
ఉద్యమం తారా స్థాయికి చేరిన సమయాన తారాలోకానికి తరలిపోయిన
ఆదిగురువు మనకు లేరన్న నిజం... ఒక నిశబ్ధం...
కానీ...
తన కలలలో ఈ నిశబ్ధానికి తావులేదు
ఒక్కొక్క తన విధ్యార్ధిలో నింపిన ఉద్యమ ఊపిరిలో నిస్తేజానికీ తావులేదు
ఆచార్యుడి ఆలోచనలు అమలు చేసి
తను కన్న కలల తెలంగాణ తెచ్చి
ఆ ఆజన్మ బ్రహ్మచారికి అశ్రునివాళి అర్పిద్దాం...
ఈ నేల కన్న అపర శంకరుడు మన జయశంకరునికి జేజేలు పలుకుదాం...

ఆచార్యా...!
ఈ నేల సాక్షిగా
నువ్వు నేర్పిన పాఠాల సాక్షిగా
ఈ నేలకై నేలకొరిగిన నా అన్నదమ్ముల సాక్షిగా
ఓరుగల్లు కోట, యాదగిరి నరసింహ, కొమురెల్లి మల్లన్న, సమ్మక్క సారక్క ల సాక్షిగా
ఈ గడ్డన బుట్టిన బిడ్డల కోసం నువ్వు సల్పిన దశాబ్దాల సుదీర్ఘ పోరు సాక్షిగా
ఈ మన్ను తిన్న మనిషిగా, ఈ నేల రొమ్ము పాలు తాగిన బిడ్డగా... ప్రతిజ్ఞ చేస్తున్న...
నా తల్లినీ , నా తోడబుట్టిన ఈ జనకోటిని కాపాడుకుంట... తెలంగాణను తెచ్చుకుంట....
-- శ్రీనివాస్ రెడ్డి కొంపల్లి